Banswada News
చెక్‌డ్యామ్‌లో జలకళ.. గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు...
Quick Summary:
మంజీరా చెక్‌డ్యామ్ నీటితో కళకళలాడుతుండటంతో రైతుల్లో ఆనందం.
మోసిన్ 5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ శివారులో మంజీరా నదిపై ఇటీవల నిర్మించిన చెక్‌డ్యామ్ భారీ వర్షాలతో పూర్తిగా నిండి జలకళ సంతరించుకుంది. నిండుకుండలా నీటితో కళకళలాడుతున్న చెక్‌డ్యామ్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలతో కలిసి చెక్‌డ్యామ్ వద్ద గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి పూలు సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆయన ప్రార్థించారు.చెక్‌డ్యామ్ నిర్మాణం పూర్తయిన కొద్దికాలానికే భారీ వర్షాలతో నీరు చేరి నిండుకుండలా మారడంతో రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్‌డ్యామ్‌లో నీటి నిల్వల కారణంగా భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు సాగునీరు, తాగునీటి అవసరాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణకు చెక్‌డ్యామ్‌లు ఎంతో కీలకమని, ఇలాంటి నిర్మాణాలు వ్యవసాయాభివృద్ధికి, భూగర్భ జలాల పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయని పలువురు పేర్కొన్నారు. చెక్‌డ్యామ్‌లో ఉప్పొంగుతున్న నీటి అందాలను తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో యువజన నాయకులు మియాపురం శశికాంత్, మాజీ ఎంపీపీ రఘు, కొరిమె రఘు, దుంపల రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
