Banswada News
5టీవీ న్యూస్ కథనానికి స్పందన... నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తప్పవన్న సూపరిండెంట్.
Quick Summary:
వీల్‌చైర్ ఘటనపై సూపరిండెంట్ సీరియస్.
5టీవీ న్యూస్ ప్రతినిధి, బాన్సువాడ : బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాలు ఫ్రాక్చర్‌తో చికిత్స కోసం వచ్చిన రమేష్ అనే రోగికి వీల్‌చైర్ అందించడంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించిన ఘటనపై ఆసుపత్రి సూపరిండెంట్ ఎం. శ్రీనివాస్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం 5టీవీ న్యూస్ లో ప్రచురితమైన వార్తను పరిశీలించిన అనంతరం ఆయన వెంటనే ఆసుపత్రి సిబ్బందితో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సమయానికి, గౌరవప్రదంగా వైద్య సేవలు అందించడం సిబ్బంది బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం లేదా రోగులను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని తెలిపారు. రోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మెరుగైన వైద్య సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని సూపరిండెంట్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా ఆసుపత్రి యంత్రాంగం మరింత బాధ్యతతో పనిచేయాలని సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు.