Banswada News
వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు...
Quick Summary:
ప్రజల భద్రతే తొలి ప్రాధాన్యత: కాసుల బాలరాజ్.
5టీవీ న్యూస్ బాన్సువాడ : బాన్సువాడ పట్టణ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని బాన్సువాడ మున్సిపాలిటీ శనివారం వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రత్యేక బృందాల సహాయంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న వీధి కుక్కలను ప్రత్యేక బోన్లలో బంధించి సంబంధిత కేంద్రాలకు తరలించారు.ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వీధి కుక్కల దాడుల్లో చిన్నారులు గాయపడిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రజల సంరక్షణకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కుక్కలతో పాటు కోతుల బెడదను కూడా నివారించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ ప్రత్యేక కార్యాచరణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.పట్టుబడిన వీధి కుక్కలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టెరిలైజేషన్, రేబిస్ టీకాల కోసం గుర్తించిన కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. కోతుల నియంత్రణకు కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ప్రజలు కొద్ది రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నారులను ఒంటరిగా బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఇళ్ల పరిసరాల్లో ఆహార వ్యర్థాలు, తినుబండారాల అవశేషాలను బయట వేయకుండా పరిశుభ్రత పాటిస్తే వీధి కుక్కల సంచారం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు.పట్టణ ప్రజల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని, వీధి కుక్కలు, కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు కొనసాగిస్తామని రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ హామీ ఇచ్చారు.