5టీవీ న్యూస్ నిజామాబాద్ : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ ఇంచార్జి కలెక్టర్ భవేష్ మిశ్రా ఐఏఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారులు, ఇరిగేషన్, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, సాగునీటి లభ్యత, ప్రస్తుత పంటల పరిస్థితి, భవిష్యత్తులో నీటి వినియోగంపై అధికారులు సమీక్షించారు.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిపోవడంతో ప్రస్తుతం సాగులో ఉన్న వరి పంట తీవ్రంగా ప్రభావితమవుతోందన్నారు. నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పంటలను ఎలా సంరక్షించుకోవాలో రైతులకు తక్షణమే సాంకేతిక సలహాలు అందించాలని అధికారులను ఆదేశించారు.ప్రస్తుత వానాకాలంలో వరి సాగు కష్టసాధ్యంగా మారుతున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు అవసరమైన సూచనలు, సాంకేతిక సహకారం వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు.
నిజాంసాగర్ నీటి నిల్వలపై ఆందోళన...
నిజాంసాగర్ ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడం వల్ల భవిష్యత్తులో నీటి పంపిణీపై ప్రభావం పడే అవకాశం ఉందని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
అందుబాటులో ఉన్న నీటిని మితంగా, సమర్థవంతంగా వినియోగించాలని, అవసరానికి అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో నీటిని విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలి...
వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోచారం సూచించారు. ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సూచనలు రైతులకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ రైతులకు అండగా నిలిచేందుకు అవసరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని ఆయన సూచించారు. సమీక్ష సమావేశంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పలు కీలక అంశాలపై చర్చించి, ముందస్తు కార్యాచరణపై అధికారులకు సూచనలు చేశారు.
Banswada News
వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష
Quick Summary:
రైతులకు తక్షణ సాంకేతిక సలహాలు అందించాలి : పోచారం శ్రీనివాసరెడ్డి
